సంబంధిత వార్తలు

ఇంకెన్నాళ్లు బాబు గారు చెత్త రాజకీయయాలు?

చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు నేతి బీరకాయలో నెయ్యిలా ఉంటాయ్. రాజకీయాల్లో తనంతటి మేధావి కానీ,అనుభవజ్ఞుడు కానీ,నీతిమంతుడు కానీ ఎవ్వరూ లేరని, ఆయన,ఆయన గారి అభిమానులు చెప్పే నీతులు అన్నీ ,ఇన్నీ కావు.ఆచరణలో మాత్రం శూన్యం.

చంద్రబాబు గారు కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చి తన చాతుర్యంతోనో,వెన్నుపోటుతోనో పార్టీని కైవసంచేసుకున్నాడన్నది జగమెరిగిన సత్యం. తాను ముఖ్యమంత్రిగా ఉండాలనేదే అయన లక్ష్యం, కాకపోతే లక్ష్మీ పార్వతి నుండి పార్టీని కాపాడుకోవడం కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని బాబు గారి బృందం చెప్తుంటారు. ఎవరెన్ని చెప్పినా నైతికంగా ఇది తప్పే. నిజంగా పార్టీని కాపాడుకోవాలి అనుకుంటే అప్పటికే పార్టీలో ఉన్న హరికృష్ణనో,కోడెలనో పార్టీని అప్పగించవచ్చు. కానీ అది జరగలేదు కదా ? సరే అది ఆ పార్టీ అంతరంగిక వ్యవహారం అనుకుందాం.

వై.యస్.ఆర్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది, కానీ ఆ రోజు ప్రభుత్వం కూలిపోకుండా కాపాడింది ఖచ్చితంగా చంద్రబాబే. సరే అది చాణక్యం అనుకుందాం.

రాష్ట్ర విభజన జరిగాక, 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో పవన్,బిజేపి సాయంతో జగన్ని ఓడించి ముఖ్యంమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. తరువాత అయన చేసింది ఏమిటి? వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీనే ,లేకుండా చేద్దామని చూశాడు.ఆ పార్టీ తరుపున గెలిచినా ప్రజాప్రతినిధులను డబ్బుతోనో,బెదిరించో తన పార్టీలోకి లాక్కున్నాడు. రాజకీయాల్లో తనంతటి నీతిమంతుడు లేడని చెప్పే చంద్రబాబు గారు,ఇలా చేయడం సమంజసమా?

ఆ తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో బిజేపి అంటూ,కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నాడనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ తో విడిపోయినట్లు నటించాడనేది వాస్తవం. తీరా ఆయన పప్పులుడకక ఓడిపోయాడు. మళ్ళీ బిజేపి అవసరం తెలిసొచ్చింది. తమ పార్టీ రాజ్యసభ సభ్యులను బిజేపి చెంతకు చేర్చి,ఎలానో దగ్గరయ్యాడు,2024 లో అధికారం తిరిగి సాధించాడు. ఇందులో కొంత వరకు బాబు గారి చాణక్యం ఉన్నా,నైతికత ఎక్కడుంది ?

కూటమి ప్రభుత్వం కొలువు తీరాక జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి నాయకులను భయపెట్టో,ప్రలోభపెట్టో మున్సిపాలిటీల కైవసం చేసుకుంటున్నారు. ఇన్ని నీతులు చెప్పే చంద్రబాబు గారు కేవలం మున్సిపాలిటీల కోసం ఇంతలా దిగజారటం అవసరమా? గతంలో వైసిపి చేసింది కాబట్టి మేం కూడా చేస్తున్నామని తెలుగుదేశం నాయకులు,చంద్రబాబు సమర్ధించుకోవచ్చుగాక. అలా చేసిన జగన్ని రౌడి,గుండా,రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. మరిప్పుడు చంద్రబాబు కూడా రౌడినేనా ? ఇది ఎవరి రాజ్యాంగం ?

చంద్రబాబు లాంటి తలపండిన నాయకులు చేయాల్సిన పనులు కావివి. నీతులు చెప్పడమే కాదు బాబు గారు,నీతి పాటించి చూపాలి.

సంబంధిత వార్తలు