వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం తొ,రాక్షస మూకతొ పోరాడుతున్నానని చెప్తుంటారు . ఆయన ఉద్దేశ్యం ప్రకారం చంద్రబాబు,ఆంధ్రజ్యోతి,ఈటీవీ,టీవీ 5 అనేవి దుష్ట చతుష్టయాలు. జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లే ఈ మీడియా సంస్థలన్నీ చంద్రబాబుకి అనుకూలంగాను,జగన్ కి వ్యతిరేకంగాను పని చేస్తాయనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం.
బాబు అనుకూల మీడియా 24 గంటలు వార్తల్లో చెప్పేది , జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని ,పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారని ,రాష్ట్రం రావణకాష్టం అవుతుందని. ఏ వార్త అయినా అటు తిప్పి,ఇటు తిప్పి చివరికి జగన్ వలన రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందనేది వారి ప్రచారం,నమ్మకం,వాదన. చాలా వరకు ఈవిధంగా నమ్మించటంలో విజయం సాధించారు కూడా.
ఇక తెలుగు నటుల్లో జగన్ కి కానీ,ఆయన పార్టీకి కానీ దొరికే మద్దతు చాలా చాలా తక్కువ. రోజుకి 500 రూపాయలు తీసుకుని నటించే వారు,టీవీ షోలు చేసుకునే వాళ్ళు కూడా జగన్ కి 11 సీట్లు వచ్చాయని వెటకారం చేసే వాళ్ళే.
వెబ్ సెట్స్,మీమ్ పేజెస్ కూడా ఎక్కువ శాతం జగన్ కి వ్యతిరేకమే. ఒక్క సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి కాస్త బలం ఉండేది. రాను రాను సోషల్ మీడియాలో కూడా జగన్ కి బలం తగ్గుతూ వస్తుందనేది వాస్తవం.
జగన్ కి వ్యతిరేకంగా ఇన్ని వర్గాలు పనిచేసినా,చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసినా,ఇదంతా ఒక్క రోజులోనో,ఒక్క సంవత్సరంలో అయ్యే పని కాదు.చాలా ముందు చూపు,ఖర్చుతో కూడిన పని.చంద్రబాబు గారు పార్టీకి బలం పెంచే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరు.చంద్రబాబు పాలన అద్వాన్నంగా ఉన్నా బ్రహ్మండం భజగోవిందం అంటూ వెనకేసుకొచ్చే మీడియా ఉండబట్టే ఆయన ఇన్నాళ్లు రాజకీయాల్లో నెట్టుకొస్తున్నారు.
జగన్ పరిస్థితి ఇది కాదు.ఒక్క సాక్షి మీడియా మాత్రమే జగన్ కి ఉన్న అండ. అది కూడా జగన్ సొంత మీడియా కావడంతో తటస్థులు అంతగా సాక్షిని నమ్మలేని పరిస్థితి.చంద్రబాబుకున్న మీడియా బలంతో పోల్చుకుంటే జగన్ మీడియా బలం బహు స్వల్పం. చంద్రబాబుని ఎదుర్కోవాలంటే ఆయనకు మించిన మీడియా అండ జగన్ కి ఖచ్చితంగా ఉండాలి.
ఇక సామాజికవర్గాల పరంగా చూసుకుంటే కాపు,కమ్మల బలం చంద్రబాబుకుంది. కాపులను పవన్ కళ్యాణ్ సాయంతో బాబు దగ్గర చేసుకోగలిగారు. బలమైన ఆ వర్గం జగన్ కి చాలా దూరం జరిగింది. ఇందులో బాబు,పవన్ ల లౌక్యం ఎంతుందో,జగన్ స్వయంకృతం కూడా అంతే ఉంది.ఇతర అగ్రవర్ణాల్లో కూడా జగన్ పట్ల అంత సానుకూలత లేదనే చెప్పాలి.
బాబు,పవన్ ద్వయాన్ని ఎదుర్కోవాలంటే, జగన్ ఖచ్చితంగా ఆయనకు దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవాలి,మీడియా బలం పెంచుకోవాలి.